7, ఫిబ్రవరి 2010, ఆదివారం

వెన్నెల..

ఓ మంచి వెన్నెల రాత్రి
చల్లని మంచుల ధాత్రి
ఆకాశంలో ఎవో రెండు తారలు మాట్లాడుతూ ఉంటే..
ఆ మాటలు కూడా చక్కగా వినిపించేంత ప్రశాంత కాంతి...
నింగి నుండి ఎవరైనా తెల్ల కాగితాలను విడుస్తున్నారా..?
దేవతలు పండగ జర్పుకుంటే, పొంగిన పాల నురుగు భూమిపై పడుతుందా...?
అనిపించే చక్కని శ్వేతవర్ణ వెన్నెల బంతి....

అయినా ఆ వెన్నెల ..
తిలక్ వెన్నెల వెల్లువలా
యండమూరివారి "వెన్నెల్లో ఆడపిల్ల"లా కాకుండా
కాస్త వన్నె తగ్గి బాధపడుతున్నట్టుంది...ఎందుకో అడగాలి...

ఇంతైనా..ఆ వెన్నెల ఎంత బాగుందంటే..
మహానుభావుల మనస్సులను ఆకాశంలో ఆరేసినట్టూ..
అన్ని చుక్కలనూ ఒకచోట కట్టి చక్కగా పారేసినట్టూ...
పసి పాప నవ్వంత అందంగా..
ఆకలేస్తే కంచమ్లో పెట్టిన బువ్వంత ఆర్ద్రంగా ..కనిపిస్తుంది...

అడుగుదామా..వద్దా ..అనుకుంటూనే...అడిగేసా
తన ముందుకు ఓ చిన్న అడుగేసా...
వెన్నెలమ్మా..ఓ వెన్నెలమ్మా.."నీ వన్నెలేవమ్మా..?"
"నిన్నటి నీ రజతపు జున్నులేవమ్మా...?"

అంతలోనే..మావాళ్ళందరూ చుట్టూ చేరి నవ్వేసారు..
ఎందుకంటే..
అదో మంచి కల..
మనస్సాగరపు వింత అల..
ఇలలో ఓ సంతోషాల వల..
కుహూ కుహూల శ్యామల కోకిల..
లేచి ఆలోచించా..
ఆహా ఎంత మంచి స్వప్నం..
మెరుపుల మేలుజాతి రత్నం...
విఘ్నాలు రాని మహా యజ్ఞం..
నిత్య సత్యం కాని ప్రయత్నం...