29, మే 2010, శనివారం

పాడు యవ్వనం...

లెక్కలు మారాయ్..
రెక్కలు విరిగాయ్..
బొక్కలు తేలాయ్..
పట్టపగలే యవ్వనాకాశంలో చుక్కలు మెరిసాయ్..!!
శైశవ క్షేత్రంలో పిచ్చి మొక్కలు మొలిసాయ్...!!
ఎందుకొచ్చిందో ఈ పాడు యవ్వనం..
ఏం పాపం చేసిందని నా బాల్యం..?
పాడలేకపోతున్నా ఈ యువగీతం..విప్పలేకపోతున్నా నా నవగాత్రం...

చిక్కులు మిగిలాయ్..
దిక్కులు చేరాయ్..
హక్కులు తెలిసాయ్..
తోకలు తొక్కకముందే నక్కలు ఉరికాయ్..!!
మేకలు మేతకు వెలితే కుక్కలు మొరిగాయ్..!!
ఎందుకింత తొందరపడిందో నా యవ్వనం..
ఏమంత అనుభవించిందని నా బాల్యం..?
గీయలేకపోతున్నా ఏ కొత్త చిత్రం..వీడలేకపోతున్నా ఈ మత్తు మాత్రం...

లక్కులు వదిలాయ్..
కిక్కులు మిగిలాయ్..
పక్కలు అరిగాయ్..
గమ్యం దారిలొ మొదలే పిక్కలు అలిసాయ్..!!
లక్ష్యపు బాటలొ ఏవో చెక్కలు వెలిసాయ్..!!
ఎందుకింత పగబట్టిందో నా యవ్వనం..
ఎక్కడికెలిపోయిందో నా బాల్యం..?
రాయలేకపోతున్నా ఓ మార్పు కవిత్వం..మోయలేకపోతున్నా ఈ వయసు పటుత్వం...


14, మే 2010, శుక్రవారం

పదిలం…

వసంతఋతు ఆగమనం పదిలం..
శరత్ కాలపూ “వెన్నెల” పదిలం..
నా కన్నుల్లో.. నీ రూపం పదిలం..
నా గుండెల్లో..నీ భావం పదిలం..

నీకేదో చెప్పాలని ఎడ్చే…
నా మదిలో శ్వాసలు ఎన్నో పదిలం….!!
నీవైపే చూడాలని తపించు…
కళ్ళలో వేల బాసలు పదిలం…!!

గుడిగంటలాగ నువు నవ్వేస్తావు…
నా గుండె గొంతుకను నలిపేస్తావు..
ఏదో చెప్పాలను నా ఆత్రాన్నీ…
అమాంతం నువ్వు చిదిమేస్తావు…..!!


నీ మాటల్లో.. సంకేతం పదిలం…
నీవల్లే సంతోషం పదిలం…
బరువైన గుండె తలపులు పదిలం…
చెరువైన కళ్ళ చేష్టలు పదిలం….

రక్కసి చూపులు కోరలు చాచగ..
కొంటె తనపు నీ నవ్వులు పదిలం…!!
స్నేహితుడిచ్చాడంటూ చూపిన..
కొత్తపరిమలపు పువ్వులు పదిలం…!!

చిన్ని బాధకే ఏడుస్తావు..
నువ్వేడుస్తూ నన్నేడ్పిస్తావు..
నీకొరకే..నేనేదొ చెప్తే..
వద్దంటూ నన్నాపేస్తావు..!!


తెలిసీతెలియ”నీ” సూక్తులు పదిలం..
బాధలు పదిలం..భయాలు పదిలం..
“రా” అంటూ నీ పలుకులు పదిలం..
తిట్లూ పదిలం..అగచాట్లూ పదిలం..

చంద్రుడు వెన్నై అలా కరిగినా…!!
సూర్యుడు ధరనిని ముద్దులాడినా..!!
నా మనసులో నీ “స్నేహం” పదిలం..
ఈ వయసులో.. ఓ వరమే పదిలం…

పదిలం…
పదిలం…
పదిలం…

కడగండ్లు...

పాపం ఆ పసి హృదయం తల్లడిల్లిపోతుంది..
అన్నం తిని సరిగ్గా మూడు రోజులౌతుంది...
అర్ద రూపాయ్ కోసమైన ఆరు చోట్ల చేయిచాచి..
ఓ ముదుసలి ఓపలేక తన కడుపును నింపుకుంది...
బువ్వ కొరకు చిట్టి చేయి వాత పెడితె ఓర్చుకుంది..
సిగ్గు విడిచి ముసలి మనసు తిట్టినా నవ్వుకుంది...
కార్మికులుగ చిన్నవాళ్ళు గుండె నిండ కన్నీళ్ళు..
దీవించే పెద్దవాళ్ళు కళ్ళ నిండ కడగండ్లు...

నేనెవర్ని...?!

ఎంత తప్పించుకుందామనుకున్నా..
నాకు నేను ఒంటరిగా దొరికిపోయినపుడు...
అమ్మ ఒడికి దూరంగా..
కానీ అంతే గారాబంగా..
నాకు నేను జోల పాడుకున్నపుడు...

ఎవరికి చెప్పుకోవాలో తెలియక..
నాకు నేను అద్దంలో విన్నవించుకున్నపుడు...
చిరుగాలి పరుగెడుతుంటే..
ఆ శబ్దం నను భయపెడుతుంటే..
నాకు నేను ధైర్యం చెప్పుకున్నపుడు...

సమయం నను తిరస్కరిస్తుంటే..
"ఏంకాదు" అని నన్ను నేను హత్తుకున్నపుడు...
తొందర పడుతున్న కాలానికంటే..
అపుడపుడూ నే ముందు పొతుంటే..
నన్ను నేను సంతోషంతో ఎత్తుకున్నపుడు...

ఒంటరిగా ఉంటే గంటలు గంటలు..
నన్ను నేను తుంటరిగా మట్లాడించినపుడు...
రాత్రి ఆకలౌతుందంటూ..
ఈ ఒక్క బుక్కా తినమంటూ..
నన్ను నేను బుజ్జగించుకున్నపుడు...

నాకు నేను ఎమౌతాను..?
నన్ను నేను ఎటు తీసుకుపొతాను..?
అసలు,,...నాకు "నేనెవర్ని"...?