10, ఆగస్టు 2010, మంగళవారం

జెండా...

ఈ రోజు..
బాల భానుని తొలి పొద్దు ముద్దు ముద్దు కిరణాలు...
వాటికిందే తెల్లని పిల్ల మేఘాల బృహత్ సమీకరణాలు...
చల్లగాలి పాట పల్లవికి నృత్యమాడే పైరు గణాలు...

అదిగో జెండా ఎగిరింది..
మన జెండా ఎగిరింది ...
నింగీ నేల కలిసి మన భారత జెండా ఎగిరింది....

అదో ప్రస్థానం.. మహా మహా ప్రస్థానం ...
ఖడ్గం కంటే పదునైన మన జెండా ప్ర"స్థానం"...

కాషాయాగ్ని..తెల్లని గాలి...
పచ్చని నేల ..నీలి చక్రపు నీరు..
నింగితో కలిసి పంచ భూతాల సమాహారం ఈ జెండా...

భారతావని గుండె ధైర్యం..
ఆ గుండె ధైర్యపు ఆత్మస్థైర్యం... ఈ జెండా...

భారతీయులందరి సంతకం..
చరిత కావ్యపు మేలు పుస్తకం... ఈ జెండా...

అఖండ భరతఖండ హస్తం..
వందేమాతరగీతపు ప్రియ నేస్తం... ఈ జెండా...

ఈ పండుగనాడు..
మన స్వతంత్ర పండుగనాడు..
మన జెండా పండుగనాడు..
ఈ మన జెండా గారి గురించి....

తెల్లవారిని వెల్లగొట్టేందుకు జాతి జనులందరికీ ఒక ఆయుధం కావాలి..ఆ ఆయుధం ఎర్ర కుక్కలను ఉరుకులు పెట్టించాలి, పరుగులు తీయించాలి, స్వతంత్ర భారత ఫలాలను అందరికీ అందించాలి అనే వజ్ర సంకల్పాయుధం అయ్యింది.."జెండా"గా మారింది...
ప్రతీ భారతీయుడు ఓ సైనికుడు..అలా ప్రతీ సైనికుడూ పేల్చగలిగే తుపాకీ, విసరగలిగే బళ్ళెం, తిప్పగలిగే కత్తి, వేయగలిగే బాణం రూపంలో వందేమాతర నినాద హస్తంలో ఆ జెండా ఒదిగింది...

అలాంటి జెండా, మనమిపుడు ఎగరేస్తున్న జెండాగా రూపంతరం చెందడానికి, త్రివర్ణాలంకృతం కావడానికి, చక్రధారి అవడానికి కాలం చాలా రోజులే ఆలోచించింది.జాతికి గొప్ప వర జెండానందించింది. వందేమాతరం అని రాసుండి దేశ కళలను,మతాలను అభినయిస్తూ ,అనుకరిస్తూ ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్తో 1906 లో మన జెండా నిగివైపుకు ప్రయాణం మొదలెట్టింది. స్వాతంత్రోద్యమం ప్రజ్వలన స్థాయికి చేరుకునేసరికి ఓ స్వేచ్చాకాంక్ష, ప్రతీ భారతీయుడీ ఒకే ఆకాంక్షా తెల్ల దొరల కళ్ళకు కట్టేలా చూపించాలని 1921 లో బెజవాడ(విజయవాడ) అఖిలభారత కాంగ్రెస్ సదస్సులో గాంధీజీ మన పింగలి వెంకయ్య గారు రూపొందించిన జెండాను పరిచయం చేసారు. రెండు రంగుల ఆ జెండా ఎరుపు హిందువులను, ఆకుపచ్చ ముస్లింలను ప్రతిబింభించేలా ఉండేది.

తరువాతి కాలంలో గాంధీజీ చేసిన కొన్ని సూచనలమేరకు మిగిలిన మతాలను తెలుపుతూ ఒక తెల్లని పట్టీ మరియు అభివృద్ధిని సూచిస్తూ "రాట్నం" జెండాలో చేరాయి.1931 లో ఈ జెండా అందరిచేతా ఆమోదించబడి, చేతుల్లోనికి తీస్కునబడింది. ఇలా ప్రయానిస్తూ మన జెండ ఆంగ్ల పాలకులను మన దేశ పొలిమేరలు దాటించింది.

1947 జులై 22న రాజ్యాంగ సంఘం మరిన్ని మార్పులు చేస్తూ జెండాను ఆవిష్కరించింది.అదే ఇపుడు మన కల్లముందు ఎగురుతున్న జెండా. ఇందులో త్యాగాన్ని, ధైర్యాన్ని ప్రతిభింబించే విధంగా కాషాయాన్ని ఎరుపు స్థానం లో పై పట్టీగ, శాంతిని సత్యాన్ని తెలిపే తెలుపు పట్టీని మధ్యలో, వ్యవసాయాన్ని నమ్మకాన్ని చూపించేలా ఆకుపచ్చ పట్టీని కింద ఉండేట్టు రూపొందించారు. తెలుపు పట్టీ పైన ధర్మాన్ని ఆవిష్కరించేదిగా అశోక ధర్మ చక్రాన్ని ఉంచారు.ఆ 24 ఆకుల చక్రాన్ని అశోకుని సారనాథ్ స్థూపం నుంది తీసుకున్నారు.

ఇలా మన జాతీయ జెండా భారతీయుని సుగునాలనే వెలుగులను ప్రసరిస్తూ ఎగురుతోంది...ఎగురుతూనే ఉంది.....

మన తిరంగా జెండాను ఇలా గౌరవించాలి...
  • జెండా ఎగురవేసే ప్రదేశంలో మరే ఇతర జెండాలు జాతీయ జెండా కంటే ఎత్తులో ఎగరరాదు.
  • కాషాయం ఎపుడూ పైకి వచ్చేదిగా జెండాను ఎగరవేయాలి.
  • నిలువుగా కట్టినపుడు కాషాయం ఎడమవైపుకు రావాలి.
  • జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2 గా ఉండాలి.
  • ఎట్టి పరిస్థితుల్లో జెండాను నేలకు తాకనీయరాదు.
  • జాతీయ జెండాను ఏ పార్టీ, మతం ఉపయోగించకూడదు.
  • చిరిగిన జెండాను ఎగురవేయరాదు..

1 కామెంట్‌: